అమరావతి శంకుస్థాపనకు హాజరై రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు తెరతీశారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్వయానా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించటంతోపాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నా దగ్గరుండి కేసీఆర్ కి అతిథిమర్యాదలు చేశారు చంద్రబాబు. ఇక ఇరు రాష్ట్రాలలో శాంతి వాతావరణం నెలకొనటంతోపాటు సంబంధాలు మెరుగుపడతాయని అంతా అనుకున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతి కోసం విబేధాలను పక్కనపెట్టి సఖ్యంగా ఉండాలని ఇరువురు ముఖ్యమంత్రులు భావిస్తుండటం శుభసూచకమని విశ్లేషకులు చెప్పారు కూడా. అయితే ఈ మధ్యలో వరంగల్ ఉపఎన్నికలు వచ్చిపడటంతో మళ్లీ సీన్ మొదటికొస్తుందేమోనని అంతా భయపడ్డారు.
కానీ అదంతా మా స్నేహానికి అడ్డురాదంటున్నారు ఆ ఇద్దరు చంద్రులు. మరోసారి వీరిద్దరు ఒకేవేదికపై దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే అతిథి మర్యాదలు అందుకునే వంతు ఈసారి చంద్రబాబుది కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నిర్వహించబోతున్న చండీయాగానికి వెళ్లే యోచనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వచ్చినందువల్ల, ఆయన నిర్వహిస్తున్న యాగానికి వెళితేనే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు. టీటీడీపీ నేతలతో భేటీ సందర్భంగా ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పినట్టు బోగట్టా. కేసీఆర్ నుంచి ఆహ్వానం అందితే తాను తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందని తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు స్పష్టం చేశారట. మరోవైపు, చంద్రబాబును ఆహ్వానించాలనే యోచనలో కేసీఆర్ కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.