విభజన సందర్భంగా చీమ కుట్టకుండా ఉన్న దానికి ఫలితమేంటో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. పార్టీ నామరూపాలే కాదు ఫ్యూచర్ లో కోలుకోని పరిస్థితి ఇప్పుడక్కడ ఉంది. మరి అలాంటి తప్పులు ఇప్పుడు అధికార పార్టీ కంటిన్యూ చేస్తే భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో నాటి యూపీఏ ఇచ్చిన హామీని.. నేటి అధికారపక్షమైన ఎన్డీయే సర్కారు లైట్ తీసుకోవటం తెలిసింది. దీనిపై అధికార పక్షం కూడా కిక్కురు మనకుండా ఉండటం మరీ దారుణం. ఇవేవీ పట్టనట్టు మనకు మినహాయింపు ఉంది అని నేతలు గంభీరాలు పోవటం. నేనున్నానంటూ చంద్రబాబు చెప్పటం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఓవైపు కేంద్రం నుంచి సూటిగా, స్పష్టంగా ప్రకటనలు వస్తుంటే ప్రజల్లో అలజడి రేగడం మొదలైంది. దానికి ప్రతిఫలమే మునికోటి ఆత్మ బలిదానం.
ఈ ఉదంతంతో ఒక్కసారి ఉలిక్కిపడింది ఏపీ.. రాజకీయ నాయకులు వైఫల్యం, వారి స్వార్థంతోనే అతను మరణించారని సగటు ఆంధ్రుడు అనుకునే పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఆచితూచి అడుగులేయటం చంద్రబాబు నుంచి ఆశించి పెద్ద తప్పు చేసినట్లయ్యింది. మునికోటి తరహాలో ఎవరూ దుందుడుకు పనులకు పాల్పడవద్దని చెప్పటంతో పాటు.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తనకున్న కమిట్ మెంట్ ను చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే.. అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఇవేమీ పట్టని పరిస్థితి. ఆయనకు ఆయన.. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం.. అధికార పర్యటనలో బిజీ అయిపోయారు. ఈ సమయంలో ప్రజలకు ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని ధైర్యం చెప్పాల్సిన బాబు అవేం పట్టనట్టు ఉంటే కాంగ్రెస్ కి పట్టిన గతే పడుతుందనటంలో అతిశయోక్తి లేదు.
ఓ వైపు పాలనా కుంటుపడుతుంటే, మరో వైపు ఇలాంటి ఘటనలు జరుగుతుంటే... ప్రజలకు మనో ధైర్యం కల్పించాల్సింది పోయి అధికార టూర్లంటూ బిజీగా గడపటం ఎంతవరకు సమంజసం. ఇష్టారాజ్యం ఎప్పటికైనా నష్టాన్నే చేకూరుస్తుంది.