ఆ తిట్లతో రోజా రేంజ్ పెరిగిందా?

December 18, 2015 | 04:54 PM | 1 Views
ప్రింట్ కామెంట్
chandrababunaidu_fired_on_roja_in_call_money_issue_niharonline.jpg

ప్రతిపక్ష పార్టీ వైకాపా తరపున ఫైర్ బ్రాండ్ ట్యాగ్ లైన్ తగిలించుకుని సందు దొరికితే చాలు అధికారపక్షాన్ని, ముఖ్యంగా అధినేత చంద్రబాబు పై ఆరోపణలు చేస్తూ వస్తుంది నటి, నగరి ఎమ్మెల్యే రోజా. అయితే ఇంత కాలం శృతి మించి విమర్శలు చేసినప్పటికీ ఎక్కడా చంద్రబాబు ఆమెను పన్నెత్తి ఒక్క మాట అన్న దాఖలాలు లేవు. అయితే ప్రస్తుతం కాల్ మనీ వ్యవహారంతో ఏపీ అసెంబ్లీ గందరగోళంగా తయారయ్యింది. ఈ సమయంలో అంబేద్కర్ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా రోజాపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పదే పదే స్పీకర్ పోడియం చుట్టూ చేరి సభా కార్యకలాపాలను అడ్డుతగలటంలో వైసీపీకి నాయకత్వం వహిస్తున్నరోజాను ఉద్దేశించి ఘాటుగా నిప్పులు చెరిగారు.

‘ఆమె మహిళా? ఆమె మాట్లాడే మాటల్లో సభ్యత ఉందా? అసలు ఆమె ఆడదేనా? ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా? సంస్కారం లేకుండా ఆమె చేస్తున్న నినాదాలు ఏంటి? అని చంద్రబాబు మండిపడ్డారు. సభ్యత సంస్కారం నేర్చుకోవాలని ఆయన సూచించారు. దీంతో మరింత రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఆపై వారంతా సస్పెన్షన్ కు గురయ్యారు. కాల్ మనీ వ్యవహారం మీద మీడియాతో మాట్లాడుతూ అదే చంద్రబాబు నాయుడు కూతురు కాల్ మనీలో ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అంటూ రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు ఆమెపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ఇంతకాలం ఎంత అనుచితంగా మాట్లాడినా రోజా కామెంట్లపై చంద్రబాబు స్పందించలేదు. చివరికి సహనం కోల్పోవటం మూలానో లేక మరే కారణంతోనో ఆమెపై ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రతిపక్షంలో ఇప్పటిదాకా పరిమితమైన పాత్ర పోషించిన రోజాకి ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలతో కాస్త రేంజ్ పెరిగిందనే చెప్పుకోవాలి. ఏమంటారు?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ