బడ్జెట్ సందర్భంగా ఆర్థిక సంఘం విడుదల చేసిన సిఫార్సులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెదవి విరుస్తున్నారు. కేవలం రెవెన్యూ లోటును మాత్రమే పూడ్చే విధంగా ఆర్థిక సంఘం సిఫార్సులు చేసిందని కుప్పంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు రూ.22 వేల కోట్లు విడుదల చేసిందని, ఇక ఇతర అవసరాలకు కేంద్రం దగ్గర చెయి చాచాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇదంతా 2013 జనాభా లెక్కల ప్రతిపాదన చేయటం మూలంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. ఇంకోవైపు కొన్నింటిని మాత్రం ఆయన స్వాగతించారు. కేంద్రం నుంచి నిధులు గణనీయంగా పెంచారని, 42 శాతం నిధులు కేటాయించటం అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడేందుకు ఏపీ కి కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని కోరారు.