ఏపీ సీఎం... ఏం సేవ్ చేస్తున్నారండీ?

October 26, 2015 | 03:02 PM | 1 Views
ప్రింట్ కామెంట్
chandra-babu-rejected-temporary-assembly-proposal-niharonline

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కోసం రేయింబవళ్లు కష్టపడి త్వరగతిన పూర్తిచెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కఠోర శ్రమ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు సాధ్యమైనంత డబ్బును పొదుపు చెయ్యాలని ఆయన యోచిస్తున్నారు.  ఈ క్రమంలో  తాత్కాలిక అసెంబ్లీ ప్రతిపాదనను ఆయన తిరస్కరించినట్లు సమాచారం. శాశ్వత అసెంబ్లీ అందుబాటులోకి రానున్నందున తాత్కాలిక భవనాల పేరిట వృథా ఖర్చు ఎందుకంటూ ఆయన ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహిస్తూ రావటంతో తాత్కాలిక భవనం ఏర్పాటు చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రతిపాదన చేశారట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తనను కలిసిన స్పీకర్ తో చంద్రబాబు తాత్కాలిక భవన నిర్మాణాన్ని విరమించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం తుళ్లూరు సమీపంలో ఉన్న హాయ్ ల్యాండ్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించుకునే విషయాన్ని పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. సమావేశాల నిర్వహణ, సభ్యులకు వసతి తదితరాలకు హాయ్ ల్యాండ్ సరిగ్గా సరిపోతుందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కేవలం రెండేళ్ల కాల పరిమితి కోసం తాత్కాలిక భవనాల నిర్మాణం అంటే, ప్రజా ధనం వృథా అయినట్లే కదా? అన్న ధోరణిలో చంద్రబాబు ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.

భేటీ ముగిసిన తర్వాత స్పీకర్ కోడెల మీడియాతో మాట్లాడుతూ సీఎం సూచనతో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను హైదరాబాదులో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాలను మాత్రం హాయ్ ల్యాండ్ లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఏపీని కాస్తలో కాస్తైనా ఊరట కలిగించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు సాకారమవ్వాలని కొరుకుందాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ