ఓవైపు మిత్ర పక్షాలు టీడీపీ-బీజేపీలు జట్టుగా చేరి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా కాస్తో కూస్తో బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట చేస్తుంది. మరి ఇలాంటి టైంలో ఖచ్ఛితంగా గెలిచి తీరాల్సిన అధికార పక్షం మాత్రం కిక్కురుమనకుండా ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ స్థానాన్ని తప్పక నిలబెట్టుకోవలసిన పరిస్థితిలో, సరైన అభ్యర్థి ఎంపిక కోసం మల్లగుల్లాలు పడుతోంది . ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన ఈ స్థానం నుంచి పెద్దపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కె.వివేక్ ను బరిలోకి దింపాలని ఆ పార్టీ చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఇక మారిన రాజకీయ పరిస్థితుల్లో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించకపోతే, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశాలు లేకపోలేదు.
ఎన్నికను టీఆర్ఎస్ పాలనకు రెఫరెండంగా ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు అధికార పార్టీని ఇరుకున పెట్టేశాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతే తన అభ్యర్థిని ప్రకటించాలని కూడా టీఆర్ఎస్ యోచిస్తోంది. ఈ క్రమంలో నామినేషన్ల గడువు ముగిసేదాకా ఉత్కంఠ పరిస్థితులు తప్పేలా లేవు. ఇప్పటికే పలువురు ఎస్సీ సామాజిక వర్గ నేతలు టికెట్ కోసం విశ్వ యత్నం చేస్తున్నా, పార్టీ మాత్రం ఒకటికి పది సార్లు ఆయా నేతల అభ్యర్థనలను పరిశీలిస్తోంది. మరోవైపు అసంతృప్తితో ఉన్న కొండా దంపతులు ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైతే తిరిగి పార్టీ మారతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో తేడా వస్తే మొత్తం జిల్లాలోనే పార్టీ ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహారిస్తున్నారు గులాబీ బాస్. ఓరుగల్లు ఉప ఎన్నికకు సంబంధించి చివరి ఘడియ దాకా ఉత్కంఠ పరిస్థితి తప్పేలా లేదు.