అపూర్వ సంగమాన్ని ఆవిష్కరించి ఒక్క రోజు కాకముందు విమర్శలు లేవనెత్తాయి. అయితే అవి రాజకీయ పక్షాల నుంచి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే... ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో బాబుపై ఏనాడు రాని మచ్చ ఒకటి తాజాగా ఆయనపై వచ్చిచేరింది.
గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించడానికి చేపట్టిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మతానికి చెందిన పూజారులను రప్పించి వారితో మంత్రాలు చదివించటం పెద్ద చర్చనీయాంశమైంది. ప్రజలకు సంబంధించిన ఓ కార్యక్రమానికి ఓ మతపరమైన ఆచారాలను పాటించడం మన దేశ లౌకిక విధానానికి విరుద్ధమని ఏపీ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య విమర్శించారు. గోదావరి జలాల మళ్లింపు ముఖ్యమంత్రి తన సొంత ఇంటికో, సొంత వ్యవహారానికో ఉద్దేశించింది కాదని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు గల మన దేశంలో ఒక మతానికి సంబంధించిన ఆచారాలను పాటించకూడదన్నారు. 1955లో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సైతం నాగార్జున సాగర్‌కు పునాదిరాయిని వేసే సమయంలో పూజలు చేయలేదని, టెంకాయలు కొట్టలేదని, మంత్రాలు చదివించలేదని గుర్తుచేశారు. ఒక దీపం వెలిగించి ఆధునిక దేవాలయమైన నాగార్జున సాగర్ జాతికి అంకితం చేస్తున్నానని ప్రకటించారని చెప్పారు. రాజ్యాంగ సూత్రాలను అమలు చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అందుకు భిన్నంగా వ్యవహరించకూడదని హితవు పలికారు.
మొత్తానికి దేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యపడని ఘనతను చంద్రబాబు సాధించారని సంతోషించే లోపే హేతువాద సంఘాల నుంచి ఆరోపణలు రావటం తీవ్ర చర్చనీయాంశమౌతోంది.