ఓటుకు నోటు రగిల్చిన చిచ్చు భవిష్యత్తులో వారిద్దరి కలయికపై నీలినీడలు కమ్మేలా చేసింది. పలు కార్యక్రమాల్లో ఆఖరికి దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి వచ్చిన సమయంలో కూడా వారిద్దరి కలుస్తారని మీడియాతోసహా అనుకున్నవారంతా భంగపడ్డారు, ఇక వారి మధ్య మాటలు ఉండబోవు అని మెంటల్ గా ఫిక్సయ్యారంతా. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఓ ప్రకటన చేశారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తానే స్వయంగా ఆహ్వానించనున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్ ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. మిగతా రాష్ట్రాల వారికి ఆహ్వాన పత్రాలు అందించాలని మంత్రులకు సూచించిన ఆయన కేసీఆర్ కి మాత్రం తానే వ్యక్తిగతంగా వెళ్లి కలిసి మరీ ఆహ్వానిస్తారట.
ఓటుకు నోటు తోపాటు వ్యక్తిగత విమర్శలను సైతం పక్కనబెట్టి ఓమెట్టు దిగి మరి కేసీఆర్ ను ఆహ్వానించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మంచిదే. మరి బాబే స్వయంగా ఇంటికొచ్చి పిలిస్తే కేసీఆర్ ఓకే అంటారా... కాదంటారా అన్నది చూడాలి. కుదరకపోతే తన తరఫున ఎవరినైనా పంపిస్తారా... లేదా తానే స్యయంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకిస్తారా ?. ఈ యక్షప్రశ్నలకు సమాధానం దసరా దాకా ఆగాల్సిందే. అయినా వారిద్దరి కలయికకు ఆ పండగ వేదికైతే అంతకన్నా సంతోషమేముంది చెప్పండి.