తరచూ సమ్మెలు, ధర్నాలు, బంద్ లు- ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఉపయోగించే ఆయుధాలు ఇవి. వారికి బాగానే ఉంటుంది. అటు చేసి ఇటు చేసి చివరికి ప్రభుత్వం దిగి రావడం, వారి డిమాండ్లను అంగీకరించడం. ప్రతి శాఖ విషయంలో ఇది జరుగుతున్న తంతే. అయితే “ ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది” అన్నట్టు ఎవరు ఏ ధర్నా చేసినా, సమ్మె సైరన్ మోగించినా బలి అవుతోంది మాత్రం సామాన్య మానవుడే. ఈ మధ్య ఆర్టీసి సమ్మె సమయంలోనే ప్రయాణీకులు ఊహించారు. ఈ భారం మన మెడకు చుట్టుకోక తప్పదని. అన్నంత పనీ జరిగింది. ఇదిగో! తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి ఏమంటున్నారంటే తప్పనిసరి పరిస్థితుల్లో త్వరలో బస్సు చార్జీలను పెంచుతున్నాము అని. ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ... పెంచడానికి మరికొన్ని కారణాలను కూడా చూపించారు. పెరిగిన డీజిల్ ధరలు, ఇతర అనేక కారణాల రీత్యా ఆర్టీసీ చార్జీలను పెంచాల్సివస్తోందన్నారు. అంతేకాకుండా ఈ నెల 28 నుంచి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగిస్తాయని తెలిపారు. 28 నుంచి, పర్మిట్ పూర్తై తెలంగాణకు వచ్చే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులపై ట్యాక్స్ వసూలు చేస్తామని వెల్లడించారు. ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్ర ఆర్టీసీకే చెందుతాయని చెప్పారు.