హస్తం హవాకు పుల్ స్టాప్ పడ్డాక అందులో చేరిన చిరంజీవి పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యింది. 2014 ఎన్నికల రథసారథిగా బాధ్యతలు ముందుకు వేసుకుని నడిచినప్పటికీ ఆయన ప్రభావం ఎంత చూపాడో ఏపీ లో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత చిరు ను పట్టించుకునే వారే కరువయ్యారు. ఆ మధ్య రాహుల్ అనంతపర్యటనలో సెంటర్ ఆప్ అట్రాక్షన్ గా నిలిచిన యువరాజు కళ్లలో పడ్డాడేగానీ పొందింది అయితే ఏం లేదు. అడపాదడపా మీటింగ్ లకు హాజరైన తోటి నేతలు కూడా ఆయనకు గౌరవం ఇవ్వకపోవటంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు కూడా. ఈ నేపథ్యంలో సినిమాల్లో నటించి మరోసారి తన ఛరిష్మా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తనయుడి బ్రూస్ లీ ఓ గెస్ట్ రోల్ లో కనిపించిన ఆయన మునుపటి ఫిట్ నెస్ సినిమాలకు సిద్ధం అనే సిగ్నల్ ను పంపించేశారు. మరి ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒక్కటే. ఆయన రాజకీయ ప్రస్థానం ఇక ముగిసినట్టేనా?
కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఎప్పటికప్పుడు తన దూత ద్వారా అధినేత్రి సోనియాగాంధీ చిరుకు సంకేతాలు పంపుతున్నప్పటికీ తొలుత అందుకు ఆయన విముఖత చూపాడట. అయితే వారసత్వ పోరులో చిరు సినిమాల్లో రాణించటం ఇప్పుడు కష్టమేనని అర్థం అవుతోంది. దీంతో సినిమాలపై దృష్టిసారిస్తూనే రాజకీయాలను వదలకూడదని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతానని ఆయన వచ్చే రెండేళ్లు సినిమాకు కేటాయించి తిరిగి సరిగ్గా ఎన్నికల ముందు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనేది టాక్.
మరోవైపు ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పలేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ అన్నారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టారని. అందుకే విజయవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి రాలేదని చెబుతున్నారు. చిరంజీవి లాంటి మాస్ లీడర్, ఆయన చరిష్మాను ఎన్నికల్లో ఖఛ్చితంగా ఉపయోగించుకుంటామని తెలిపారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. సినీ రంగంలో అప్రధాన పాత్రలు పోషించడం కన్నా మిగిలిన జీవితాన్ని పొలిటికల్‌గా తీర్చిదిద్దుకుంటే భవిష్యత్తులో మంచి చాన్స్ కొట్టే అవకాశం ఉందని బహుశా ఆయన భావిస్తూ ఉండొచ్చు.