బీజేపీలో చేరటంపై చిరు కామెంట్స్

February 24, 2016 | 11:11 AM | 4 Views
ప్రింట్ కామెంట్
chiranjeevi-clarify-on-Party-change-BJP-niharonline

ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒక తప్పుచేసి, కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేసి ఇంకా పెద్ద తప్పుచేశాడని రాజకీయ విశ్లేషకులు నటుడు చిరంజీవి గురించి అప్పట్లో చెప్పారు. చివరికి దేశంలోనే పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ లో ఓ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి చిరంజీవిది. జనాల్లో ఉన్న కాస్త కూస్తో సింపథీ కూడా విభజన సమయంలో మాయం అయిపోయింది. దీంతో చిరు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని అంతా అనుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి త్వరలో బీజేపీ చేరనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అందుకే ఇంతకాలం చిరు కాంగ్ తరపున ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదని, చివరికి రాహుల్ హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చిన టైంలో కూడా రాలేదని చెప్పుకొచ్చారు. అయితే తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు చిరు.

                                 కడదాకా కాంగ్రెస్ పార్టీతోనే తన ప్రయాణం సాగుతుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం భుజానికి సర్జరీ అయి ఇంకా ‘చేతి కట్టుతోనే’ ఉన్న చిరు సతీసమేతంగా ఫిల్మ్ నగర్ సన్నిధానంలో జరిగిన మూడు కొత్త ఆలయాల అంకురార్పణలో పాలుపంచుకున్నారు. పార్టీ మారటంపై అక్కడి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, చిరంజీవి ఓ దశలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాను పార్టీ మారుతున్నానన్న వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ మీడియా ప్రతినిధులను కోరారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మధ్య సొంతూరు మొగల్తూరు, దత్తత గ్రామం పేరుపాలెంలో పర్యటించిన సమయంలో చిరు బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం సాగింది. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ