కొణిదెల చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్ వెలుగొందినట్లు... రాజకీయాల్లోనూ రాణిద్దామని వచ్చి బొక్కా బోర్లా పడ్డారు. అధికారంలో ఉండగా ఏ మాత్రం ప్రభావం చూపలేని వ్యక్తి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ మాత్రం ప్రభావం చూపని పార్టీలో ఆయన పరిస్థితి ఏంటో ఇప్పుడు ఎటూ కానీ పరిస్థితి. అది అర్థం చేసుకొనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారు. అడపాదడపా సమావేశాలకు హాజరయినప్పటికీ అదంతా ఆర్భాటమే. అయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాక సందర్భంగా ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వెంటవెంటే ఉంటూ యువరాజును ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న చిరు ప్రయత్నాలు చూస్తుంటే కార్యకర్తలతోపాటు సహ నేతలు కూడా నవ్వుకుంటున్నారట. ఈ క్రమంలో రాహుల్ దృష్టిలో పడేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో చిన్న అపశృతి దొర్లింది. అది కూడా రాహుల్ సమక్షంలోనే కావటం విశేషం. అనంతపురం ఓబులదేవర చెరువులో జరిగిన సభలో చిరంజీవి ఉపన్యాసం ఇచ్చాడు. ఎన్నికలకు ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడని, రైతులను మోసం చేస్తున్నాడని విమర్శలకు దిగాడు చిరంజీవి. అంతేకాదు విభజన చట్టాన్ని అమలు చేయడంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వం కూడా ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇంతదాకా బాగానే ఉంది. ఇక రెచ్చిపోయిన చిరు రానున్నవి మంచిరోజులే అని, రాజీవ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్పగలననడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. రాహుల్ అనబోయి రాజీవ్ అన్న చిరంజీవి వెంటనే ఆ తత్తరపాటును సరిచేసుకుని సారీ చెప్పి తన ఉపన్యాసం ముగించేశాడు.