ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. పెద్ద సంఖ్యలో అధికార పక్షంలోకి వలసలు వెళ్లేందుకు ఆ పార్టీనేతలంతా తట్టా బుట్టా సర్దుకుంటున్నారు. అధికారపక్షంలో ఉండి తమ పనులను చక్కబెట్టుకోవటంతోపాటు, వచ్చే దఫా కూడా టీడీపీ దే అధికారమని వారు బలంగా నమ్మటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చివరకు జగన్ పక్కన ఉన్న నేతలు కూడా ఆయనకు తెలీకుండా ఎప్పుడూ హ్యాండ్ ఇస్తారో అని చర్చ జరుగుతోంది. ఇక తాజాగా బలం అధికంగా ఉన్న కడప జిల్లాలోనే వైసీపీకి త్వరలో షాక్ తగలనుంది.
జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాను టీడీపీలో చేరేందుకు సిద్ధమంటూ బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ ఇంచార్జ్ నేత రామసుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విడాకులు తీసుకోకుండా మరో పెళ్లికి సిద్ధమైనట్లుగా... తన పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారతాననడం ఎంతవరకు సబబని రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. పలు కేసుల్లో ఉన్న తన వియ్యంకుడు కేశవరెడ్డిని కాపాడేందుకే టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. పెంచి పోషించిన వైఎస్ కుటుంబానికి ఆయన ద్రోహం చేయాలని చూస్తున్నాడని కడపలో విలేకరులతో సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆరోపించారు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే ముందు తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలన్నారు. ఓవైపు కడపలో పార్టీకి పునాదులు లేపాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబుకి సొంత నేతలంత నుంచే ఇలా ఝలక్ లు తగలటంతో ఆదినారాయణ ఎంట్రీకి కాస్త ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.