టెన్షన్ లో ఒకరు... రిలాక్స్ గా మరోకరు

September 22, 2015 | 03:38 PM | 4 Views
ప్రింట్ కామెంట్
comparision-ruling-of-KCR-chandra-babu-naidu-niharonline

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలుగు నేల రెండుగా విడిపోయింది. తర్వాత, ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల బరిలో దిగి అఖండ విజయం సొంతం చేసుకున్నారు కేసీఆర్. ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని దేశం యావత్తు కోడై కూసింది. ఆ మాటే నిజమైంది కూడా. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విభిన్నం. పదేళ్లుగా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. విభజనకు కారకులయ్యారు. ఈ సారి కూడా గెలుపు కష్టమేనని అంతా అనుకున్నారు. సర్వేలన్నీ కూడా బాబుకు ప్రజలు కట్టవు అని తేల్చేశాయి. కానీ, అంచనాలన్నిటీని తారుమారు చేస్తూ చంద్రబాబు కూడా అద్భుత విజయం సాధించారు. చివరికి మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రంగా తెలంగాణ, లోటుబడ్జెట్ తో సతమతమవుతున్న రాష్ట్రంగా ఏపీ అవతరించాయి.

             ఏడాదిన్నర గడవకముందే పరిస్థితి తారుమారైంది. ఉన్న సమస్యలన్నిటినీ ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుని నవ్యాంధ్ర రాజధాని వైపు వడివడిగా అడుగులేసుకుంటూ చంద్రబాబు దూసుకెళుతున్నారు. మధ్యలో ఓటుకు నోటుతో తలబొప్పి కట్టినా పట్టిసీమతో దానిని నయం చేసుకున్నారు. తాజాగా పెట్టుబడులకు అవకాశాలున్న రెండో రాష్ట్రంగా ఏపీని ప్రపంచ బ్యాంకు గుర్తించింది. అంతే కంపెనీలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడులు ప్రవాహాంలా వచ్చేస్తున్నాయి. క్రమంగా ఊపిరి సలపని స్థితి నుంచి ఆయన సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. మిగిలింది అమరావతికి శంకుస్థాపనే.  పాలనా పరంగా కూడా పురోగతి కనిపిస్తూ పోతుంది. ఇదే ఊపును కంటిన్యూ చేసుకుంటూ పోతే ఆయనకు చాలా మంచిది.

కేసీఆర్ విషయాని కొస్తే చేతి కింద దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటీ? క్రమంగా అప్పుల్లో తెలంగాణ కూరుకుపోతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రం రూ.51 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. అంతేకాక రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో రాష్ట్రంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు జాబితాలో తెలంగాణకు 13వ స్థానం దక్కింది. పారిశ్రామిక రంగంలో సింగిల్ విండోస్ పాలసీని అవలంభిస్తూ... దేశంలోనే ఏ రాష్ట్రం కూడా పరిశ్రమల స్థాపనకు ఇవ్వని రాయితీలు ఇస్తుంది. అయినప్పటికీ పెట్టుబడులు, కంపెనీల ప్రవాహాం జీరో.  దీంతో కేసీఆర్ కు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాల నుంచి సరైన విమర్శలు రాకపోవటం ఫ్లస్ అయినప్పటికీ, చుట్టు పరిస్థితులు దారుణంగా తయారు కావటంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలోకి కేసీఆర్ ఉన్నారన్నది నిజం.   పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ