మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను అవినీతి నిరోధక శాఖ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోల్ స్కాంలో జిందాల్ గ్రూపులకు బ్లాక్ లు కేటాయించిన ఆరోపణలపై ఆయన విచారణ ఎదుర్కొనున్నారు. అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు తాను బొగ్గుశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నిర్ణయాలన్నీ నాటి ప్రధాని మన్మోహన్ సింగే తీసుకున్నారని మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు సీబీఐ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు దాసరి తరఫున ఆయన న్యాయవాది కోర్టులో దాఖలు చేశారు.
మన్మోహన్ సమక్షంలోనే బొగ్గు క్షేత్రాల కేటాయింపులు జరిగాయని, అందుకే ఆయనను (మన్మోహన్ సింగ్) విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని దాసరి వాదన. బొగ్గు కుంభకోణం విషయంలో జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా కూడా మన్మోహన్ సింగ్ ను విచారించాల్సిందే అని గతంలో కోరారు. కాగా, తాజాగా మాజీ మంత్రి దాసరి నారాయణ రావు కూడా కోరడంతో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. గతంలో మన్మోహన్ సింగ్ పై కేసు నమోదు సమయంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. ఓ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి పేరును నిందితుడిగా చేర్చటం అంటే కక్ష సాధింపు చర్య అవుతుందని బీజేపీపై మండిపడింది కూడా. మరి ఇప్పుడు సొంత పార్టీ మనిషి నుంచే ఈ ఆరోపణలు రావటంతో ఎలా స్పందిస్తుందనేది చూడాలి.