ఎమ్మెల్సీ ఖాళీల భర్తీలో రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తి వ్యతిరేక పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల కోటాలో నాలుగు శాసన మండలి స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు ఏకగ్రీవమవ్వగా, తెలంగాణలో ఆ పరిస్థితి విరుద్ధంగా కనిపిస్తోంది. ఏపీలో అధికార టీడీపీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, ఎంఏ షరీఫ్, టీడీపీ మిత్రపక్షం బీజేపీ తరపున సోము వీర్రాజు, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ తరపున గోవింద రెడ్డి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నంతో గడువు ముగియగా, నాలుగు స్థానాలకు నాలుగే నామిషేన్లు దాఖలు కావడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కాగా ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సివుంది.
ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఎమ్మెల్యేల కోటాలో 6 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. అధికార పక్షం టీఆర్ఎస్ తరపున ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, యాదవ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల లలిత, టీడీపీ-బీజేపీ కూటమి నుంచి వేంనరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. అధికారపక్షం ఐదో అభ్యర్థిని కూడా రంగంలో దించడంతో పోటీ తప్పనిసరిగా మారింది.