పేరుకు తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. అసెంబ్లీలోనే కాదు బయట కూడా అధికార పక్షంపై కనీస విమర్శలతో కూడా ప్రభావం చూపలేకపోతుంది. విభజన ఫలితం ఏపీలోనే కాదు, ఇక్కడ కూడా లాభం చేకూర్చలేకపోయింది. అలాంటి కాంగ్రెస్ ఇప్పట్లో పునర్ వైభవం చాలా కష్టమనే చెప్పాలి. అయితే టీ కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన అక్కడి మీడియాతో మాట్లాడారు. 2017 వరకు తామంతా రెస్ట్ లో ఉంటామని చెప్పిన ఆయన 2018లో తిరిగి కార్యక్షేత్రంలోకి దిగుతామని ప్రకటించారు. 2019లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో ఏకంగా 95 స్థానాలను గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. తమ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించిన కోమటిరెడ్డి, వచ్చే ఎన్నికల దాకా జగదీశ్ రెడ్డి మంత్రిగానే ఉంటే, నల్లగొండ జిల్లాలోని మొత్తం 15 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయని ఆయన జోస్యం చెప్పారు. అసలే పార్టీ పరిస్థితి అంతతమాత్రం ఉన్న సంగతి తెలిసి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలతో విస్తూ పోవటం అక్కడున్న ఎమ్మెల్యేల వంతు అయ్యింది. జంపింగ్ లిస్టులో కోమటిరెడ్డి కూడా ఉన్నాడని పక్కనున్న నేతలే సెటైర్లు వేస్తున్నారంట.