కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తరచు విమర్శలు చేసే కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఎట్టకేలకు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించారు. తాను పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వివిధ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసే విషయంలో రాహుల్ సిఫార్సులు చేసేవారని ఆమె ఆరోపించారు. తన శరీరంలో నరనరానా కాంగ్రెస్ రక్తం ఉందని, అయితే పార్టీలో ఇప్పటి పరిస్థితులు సంత్రుప్తికంగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, గతంలో ఆమె పలు ప్రముఖ సంస్థలకు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించిన ఆమెపై కాబినెట్ సహచరులు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆపై జయంతిని పర్యావరణ శాఖ నుంచి తప్పించారు. కనీసం తనను ఎందుకు తొలగిస్తున్నారన్న విషయాన్ని కూడా వెల్లడించలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. కాగా, ఆమె వేరే పార్టీలో చేరే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.