ధర్మపురి శ్రీనివాస్ సేవ చేసే విశాల దృక్ఫథంతో కాంగ్రెసులో చేరి, భూమి తనలాగే భారీ అయిపోయినందున, వయసు తగ్గట్టుగా పరిధి కుదించుకుని విడిపోయి స్వాతంత్ర్య వాయువులు వీస్తున్న తెలంగాణలో అధికార పార్టీలో చేరి సలహాదారుడిగా ఉద్యోగం సంపాదించాడు. రెండు దఫాలు కాంగ్రెసుని గద్దెపైకెక్కించిన ఘనాపాటీని తానేనని ఒక రహాస్యం బహిరంగపరిచాడు. ఆ ఉద్రేకంలో ఇంకాస్త ముందుకు తూలాడు కూడా. ఇంత చేసినా సదరు జాతీయ పార్టీ నాకేమీ ఒరగబెట్టిందని ఒక ప్రశ్నాపత్రం విడుదల చేశాడు. మరో చక్కని సుభాషితం వదిలాడు. నా చిన్ని బొజ్జలో బోలెడన్ని రహాస్యాలు ఉన్నాయి. వెలికితీస్తే చాలా మంది కొంపలు కొల్లేరయి పోతాయని హెచ్చరిక జారీచేశాడు. తర్వాతి అంకంలో నిర్వేదం ఆవరించి మళ్లీ కాంగ్రెసు నాకేమీ ఇచ్చిందని వేదాంతీకరించాడు.
ఈ తమాషా అంతా నిశబ్ధంగా గమనిస్తున్న హన్మన్నకు (వీహెచ్) తన పేరులో దాగి ఉన్న పూర్వీకులు గుర్తుకొచ్చి, వారి అంశకువారుసుడయి నట్టి వాడైన తాను నిప్పులు తొక్కిన మాదిరి ఫీలింగు కలిగింది. కాంగ్రెసుకు వీరభక్తుడైన హన్మన్నకు తెలుసున్న ఓ రహస్యం తనవంతుగా మీడియా చెవిలో ఊదాడు. కొంచెం పరుషంగా అన్నాడు కూడా. దరిద్రుడు బీఫారాలు అమ్ముకున్నాడు. నాకు తెల్వదీ అనుకుంటున్నాడు అని . అమెరికా కెన్నెడీ ఏమన్నాడు. దేశం నాకేమీచ్చిందని ప్రశ్నించకు, నువ్వేమిచ్చావో చెప్పు అనేది ఇక్కడ పాయింటు. సంపాయించుకున్న స్థిర చరాస్తులు ఇప్పుడు చేరిన పార్టీలో సంక్షేమంగా ఉంటాయి అని హన్మన్న ముక్తాయించాడు. మనలాగ, ఎవరెలా పోతే మనకేం అనుకోకుండా హన్మన్న వలె కుప్పించి దూకి చీల్చి చెండాడాలె! జైశ్రీరాం!