అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా రెండోసారి పదవిలోకి రాగానే రకరకాల సమస్యలు వచ్చిపడుతున్నాయి. పలు విషయాల్లో ఆయనకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే మీడియా నియంత్రణకు చేసిన జీవో జారీచేసిన ఆయనకు కోర్టు అక్షింతలేసిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ ప్రభుత్వ సీఎస్ (ప్రధాన కార్యదర్శిగా) నియమితులైన శకుంతలా గామ్లిన్, కేజ్రీ అనుమతి లేకుండానే పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎస్ గా గామ్లిన్ నియామకంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో ప్రత్యక్ష పోరుకు తెరతీసిన కేజ్రీకి ఈ పరిణామం పెద్ద షాకేనని చెప్పక తప్పదు. సాధారణంగా సీఎస్ ఎంపిక ముఖ్యమంత్రి ఇష్టం మేరకు జరుగుతుంది. కానీ, కేజ్రీ మాత్రం తన అత్యుత్సాహంతో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఆమె నియమాకాన్ని కేజ్రీవాల్ వ్యతిరేకించినప్పటికీ నజీబ్ ఆమెనే ఆ పదవికి ఎంపిక చేయటం గమనార్హం.