టీఆర్ఎస్ లో జజ్జనకర జనారే మొదలైంది

October 01, 2015 | 10:47 AM | 5 Views
ప్రింట్ కామెంట్
kcr-differences-with-ministers-niharonline

టీఆర్ఎస్ లో రాను రాను పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటిదాకా లేని గ్రూప్ రాజకీయాలు, నేతల మధ్య స్పర్థలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధినేత కేసీఆర్ సైతం మంత్రులపై విరుచుకుపడటం కూడా దీనిని ధృవీకరిస్తోంది. ఇక ఈ దఫా అసెంబ్లీ సమావేశాలే ఈ కొట్లాటలకు వేదిక కావటం విశేషం. ఒక రకంగా ఇది ప్రతిపక్షాలకు పండగ లాంటిదే. అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల నుంచి సరైన విమర్శలు లేకపోవటంతోపాటు అభివృద్ధిపై కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు, మంత్రుల ఆధిపత్యం లేకుండా పాలన సజావుగా సాగింది. రాజయ్య తొలగింపు తర్వాత ఎవరు టార్గెట్ కాకుండా ఉండేందుకు వారి వారి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.

అయితే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో దగ్గర అధినేత కు దొరికిపోతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో బుధవారం జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి నిండు సభలో చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగిందటే... నిన్నటి సభలో వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై మాట్లాడేందుకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ యత్నించారు. అదే సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తన ప్రకటనను చదవడం ప్రారంభించారు. దీంతో కల్పించుకున్న స్పీకర్ మంత్రిని కూర్చోమని సూచించారు. అయితే స్పీకర్ సూచనను గమనించని పోచారం తన ప్రకటనను కొనసాగించారు. ఈ సమయంలో పోచారం పక్క సీట్లో కూర్చున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పోచారంను ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయన ‘‘ఓ అన్నా... కూకో అన్నా’’ అంటూ కాస్త గట్టిగానే అరిచారు. దీంతో కేసీఆర్ చికాకుపడ్డారు. ‘‘నీకేం పని... నీ పని నీవు చూసుకో’’ అంటూ జగదీశ్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా సభలో అధికార పక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి విపక్ష సభ్యులపై విరుచుకుపడడం మనకు తెలిసిందే. అయితే నిన్నటి సమావేశాల్లో భాగంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన సొంత కేబినెట్ సహచరుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది.

ఇక మరో ఇద్దరు అగ్రనేతల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. మంత్రులు తలసాని, పోచారం మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వీరిద్దరూ తారసపడిన వేళ వాణిజ్య శాఖా మంత్రిగా తలసాని డబ్బులు వసూలు చేసి తనకివ్వాలని పోచారం వ్యాఖ్యానించారు. తలసాని డబ్బు తెచ్చిస్తే, తాను వ్యవసాయం, రైతుల కోసం ఖర్చు చేసి ప్రజలకు అవసరమైన ఆహారం, బట్టలను సమకూర్చుతానని ఆయన అన్నారు. ఆ తరువాత తిరిగి పన్నుల రూపంలో మీ శాఖకే డబ్బు జమచేస్తామని, తిరిగి దాన్ని మళ్లీ తమకే ఇవ్వాల్సి వుంటుందని పోచారం అన్నారు. "రాష్ట్ర ప్రజల పొట్ట నాదే, బట్ట నాదే" అన్న తలసాని త్వరగా డబ్బులిచ్చే ఏర్పాట్లు చేయాలని పోచారం కోరారట. ఇక దీనికి "సరే అన్నా" అంటూ తలసాని కూడా బదులిచ్చారుట.

దీనికి బయటి నుంచి కారణాలు ఉన్నాయి. తాజాగా వెలువడిన ర్యాకింగ్స్ లో తెలంగాణకు పూర్ ప్లేస్ రావటం, ప్రజల్లో కూడా పాలనపరంగా వ్యతిరేకత మొదలవ్వటం కూడా కేసీఆర్ లో మార్పుకు కారణాలే అని చెప్పొచ్చు. మంత్రుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలో భారీ మార్పులు చేసే అవకాశం కూడా లేకపోవచ్చని తెలుస్తోంది. మొత్తానికి గులాబీ గూటిలో ఇప్పటిదాకా లేని ముసలం ఇప్పుడు మొదలైనట్లు అనిపిస్తోంది. ఇది ఇప్పుడు ఎక్కడికి దారితీస్తుందో అని ప్రస్తుతం రాజకీయ వర్గాలన్నీ వేచిచూస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ