దయా దండయాత్ర కొనసాగుతుందట

September 28, 2015 | 12:14 PM | 1 Views
ప్రింట్ కామెంట్
errabelli-on-jumpers-niharonline.jpg

చాలా రోజులుగా నానుతూ వస్తున్న ఫిరాయింపుల అంశానికి ఎట్టకేలకు తెరపడింది. ఎన్నికల సమయంలో గెలిచి ఆనక పార్టీ మారి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. టీ టీడీపీ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశం స్పీకర్ పరిధిలోనిదని, కావున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గెలుపొందిన ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు తరువాత పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరారు. దాన్ని సవాల్ చేస్తూ ఇరు పార్టీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలని కోరాయి. పిటిషన్ పై పలుమార్లు విచారించిన తరువాత చివరికి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ అంశంపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా, ఈ తీర్పుపై టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు వేగంగా స్పందించారు. తమ పార్టీ టికెట్లపై విజయం సాధించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయమై గతంలోనే స్పీకర్ ను సంప్రదించామని ఆయన తెలిపారు. సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న తమ వినతిపై స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన రాని కారణంగానే హైకోర్టును ఆశ్రయించామని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆ పదవులకు రాజీనామా చేసే దాకా వదిలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ