ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. చెరో పత్రికకు అధిపతులు . వారి మధ్య బహిరంగ విమర్శలు ఎప్పుడూ పీక్ స్థాయిలో ఉంటాయి. అయితేనేం భేటీ అయ్యారు. వారి కలయిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుల భేటీపై రాజకీయ దుమారం చెలరేగింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఈ ఇద్దరి సమావేశం కావటం పట్ల ఆసక్తితోపాటు ఏం జరిగిందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఈ భేటీపై అటు వైకాపాతోపాటు ఇటు అధికార పక్షం కూడా వివరణ ఇచ్చుకుంది.
ఇక భేటీపై ఏపీ హోం మంత్రి చినరాజప్ప భిన్నంగా స్పందించారు. వారిద్దరూ పత్రికాధిపతులు కాబట్టి వారి భేటీలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. మరోపక్క రామోజీని జగన్ కలవడంలో తప్పేముందని వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. పెద్దల సలహాలు తీసుకునే క్రమంలోనే రామోజీరావును కలిశారని చెప్పారు. ఈ భేటీని వైకాపా పూర్తిగా సమర్థిస్తోందని అన్నారు. మరో విషయం ఏమిటంటే, ఈ స్టేట్ మెంట్ తో రామోజీ, జగన్ ల భేటీని వైకాపా అధికారికంగా ప్రకటించినట్టయింది. అయితే ఇది కేవలం పత్రికలకు సంబంధించిందేనా లేదా రాజకీయమా అన్నది వాళ్లు చెప్పరు... మనకు అక్కర్లేదు. పెద్దలు అన్న గౌరవం ఉంటే ఎల్లో మీడియా అంటూ విమర్శలు చేసే సమయంలో గుర్తుకు రాలేదా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయ్. వారిద్దరి భేటీలో వింతే ఉంది మరి.