ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్ర్తత్యేక హోదా విషయమై కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే స్పందించారు. ఆయన కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయవాడలో అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టాన్ని తానే రూపొందించానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను చేతులు ఎత్తి మోక్కుతున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వంటి మెరుగైన నగరం రావాలని తాను ఆశించానని ఈ సందర్భంగా సుశీల్ కుమార్ షిండే అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో బిజెపి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేస్తోందన్నారు.
ఎన్నికలు ఉన్నాయనే సాకుతో బీహార్ రాష్ట్రానికి కోట్లాది రూపాయలు తాయిలాలు ప్రకటిస్తోందన్నారు. ఏపీలో ఎన్నికలు లేని కారణంగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్నో అంశాలను విభజన చట్టంలో పొందుపర్చామన్నారు. వాటిని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమౌతున్నాయన్నారు. ప్రత్యేక హోదాపై సమావేశం ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరిలో నాన్ పొలిటికల్ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పలు ప్రజాసంఘాలు హాజరయ్యాయి. ప్రత్యేక హోదా విషయమై మాట్లాడాయి.