తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు హాట్ టాపిక్ గా మారాయి. ఊపిరి సలపని జంప్ లతో ఆయా పార్టీల ప్రాబల్యం ఘోరంగా దెబ్బతింటుంది. తెలంగాణలో మొన్న టీ టీడీపీకి ఆ దెబ్బ తగలగా, ఏపీలో నిన్న ప్రతిపక్ష వైసీపీకి కూడా మంచి ఎదురుదెబ్బే తగిలింది. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యర్థి లేకుండా చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ పావులు కదుపుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ వంతు వచ్చింది. వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కాస్తంత గట్టి పోటీ ఇద్దామని భావించిన టీ కాంగ్రెస్ కు ఓ పెద్ద షాకే తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ముందుగా టీఆర్ఎస్ లో చేరేందుకు సారయ్య ఆసక్తిగానే ఉన్నట్లు వార్తలు రాగానే కాంగ్ సీనియర్లు మంతనాలు ప్రారంభించారు. వరంగల్ కార్పొరేషన్ పీఠం మనదేనని మనోధైర్యం ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, అ దౌత్యాలు ఏం ఫలించలేదు. సారయ్యతో టీఆర్ఎస్ కీలకనేతలు సంప్రదింపులు జరపడం, ఆ వెంటనే చేరేందుకు సారయ్య ఓకే చెప్పేయటం చకచకా జరిగిపోయాయి.
ఇక్కడ విశేషం ఏంటంటే... ఈ విషయంపై నిన్న రాత్రి దాకా సారయ్య నోరు విప్పకపోగా, కాసేపటి క్రితం తన మనసులోని మాటను ఆయన బయటపెట్టారు. అందరు నేతల్లాగే ‘‘టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. నేను కూడా నమ్ముతున్నాను. అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నాను. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నాను’’ అని సారయ్య ప్రకటించాడు.