హైదరాబాదులో కాపురాలుంటున్న కేరళీయులందరూ తెలంగాణ్యులే. మా వాళ్లతో సమాన హక్కలు ఉంటాయి అని కేరళ భవన్ శంకుస్థాపన చేస్తూ కేసీఆర్, కేరళ సీఎం ఉమెన్ చాందీ ని ఆయన రాష్ట్రాన్ని, అక్కడి ప్రజలను పొగడ్తల వర్షంలో ముంచేశారు. ఇక్కడి మళయాళీలందరికీ బోల్డెన్నీ ఇళ్లతోబాటు, బోల్డెన్నీ వరాలు ప్రసాదించేరు. వీరందరికీ తెలంగాణ అంటే చాలా వాత్సల్యమని వారి స్వంత రాష్ట్రంగా చూసుకుంటున్నారనీ కూడా చెప్పేరు.
ఇంత విశాల హృదయం కలిగి ఉన్న కేసీఆర్ కి ఇక్కడే ఉంటున్న సోదర టెల్గూస్ (తెలుగువాళ్ల) కి తన మదిలో ఒకింత చోటిచ్చి, అక్కున చేర్చుకునే చల్లని మాట అంటే బావుంటుందని క్షతగాత్రుల అభిలాష. పోనీలే అలాగే అనుకునే లోపున ఓటుకీ నోటో, కరెంటు షాకో, నీటి వాటాయో ఏదో ఒక ఉత్పాతం సంభవించి కల చెదరగొడుతోంది. ఏం చేస్తాం మళయాళీలు పెట్టి పుట్టేరు. పొరుగింటి పుల్లకూర కొబ్బరి కోరులా కమ్మగా ఉండటంతో ఏమియూ వింత లేదు కదా అయ్యప్ప స్వామీ!