ప్రస్తుతం తెలంగాణలో వైసీపీకి కొత్త కార్యవర్గం ఏర్పడింది. గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్న క్యాడర్ ను వెంటపెట్టుకుని మరీ గులాబీ తీర్థం పుచ్చేసుకున్నారు. అయినా జగన్ ఆశలు చావలేదు. కొత్త కార్యవర్గం అంటూ నియమకాలు చేపట్టాడు. ముందు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఆపై టీ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగిలిన ఎమ్మెల్యేతో సహా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇంకా వచ్చేవారిని కూడా తమతో కలిపేసుకుంటామని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేశాడు. పిలుపు అందుకున్న నేతలు ఉన్నపళంగా టీఆర్ఎస్ కండువాలు కప్పేసుకోగా, దీంతో తెలంగాణలో వైసీపీ దాదాపుగా ఖాళీ అయ్యింది. ఇప్పట్లోనే కాదు వచ్చే ఎన్నికల నాటికి కూడా పార్టీ కొలుకునే సీన్ లేదన్నది స్పష్టమవుతోంది. అయితే తెలంగాణలో తమ పార్టీ ఇంకా ఉనికిలోనే ఉందని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. అందుకోసం ఏకంగా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన గట్టు శ్రీకాంత్ రెడ్డిని ఎంపిక చేశారు.
పార్టీ అధినేత ఆదేశాల మేరకు సోమవారం ఉదయం శ్రీకాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా చేపట్టారు. శ్రీకాంత్ రెడ్డితో పాటు కొత్తగా నియమించిన నూతన కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్య ప్రకాశ్, హెచ్ఏ రెహ్మాన్ కూడా బాధ్యతలు స్వీకరించారు. దుకాణం దాదాపుగా మూతపడిపోయిన సమయంలో ఈ కార్యవర్గం కొత్త ఊపు తెచ్చి ఏదైనా వింతలు క్రియేట్ చేస్తుందనుకోవటం అత్యాశే అవుతుందన్నది జగన్ ఎరిగిన సత్యం.