చట్ట సభలో జరుగుతున్న వ్యవహారాలపై, తీరు తెన్నులపై ప్రజలే కాదు అందులోని ప్రజా ప్రతినిధులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ కోడెల శివప్రసాద్ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ విపక్షాల అల్లరికి మారుపేరుగా నిలిచిందని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా అదే స్థాయిలో ఆసక్తికర కామెంట్లు చేశారు. అసెంబ్లీలో అసలు అర్థవంతమైన చర్చ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో కొనసాగుతున్న బుక్ ఫెయిర్ ను సందర్శించిన సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘నో రూలింగ్ పార్టీ.. నో అపోజిషన్... ఏటా అసెంబ్లీలో ప్రజా అంశాలపై చర్చ జరగాలి. ప్రధానంగా పాఠశాల విద్యపై ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అసెంబ్లీకి నాలుగు రోజులు తాళమేసి అయినా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లోని సర్కారీ పాఠశాలల బాగోగులకు సదరు నియోజకవర్గ ఎమ్మెల్యేనే బాధ్యుడిని చేయాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధి, పనితీరుపై ఏటా ప్రభుత్వానికి నివేదిక అందాలని, అప్పుడే సర్కారీ విద్య బాగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల రాజకీయ వ్యవహారాల్లో ఇప్పటిదాకా జోక్యం చేసుకోనట్లే కనిపించిన నరసింహన్ నోటివంట ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు రావటంతో ఏం జరుగుతుందా అని రాజకీయవర్గాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.