టీఆర్ఎస్ లో శాంతమూర్తి, అవసరమైన వేళలో మాత్రమే ఆవేశపరుడు, సమయానుగుణంగా వ్యవహరించే నేత ఎవరన్నా ఉన్నారంటే అది మంత్రి హరీష్ రావు మాత్రమే. ఉన్న నేతల్లో ఎవరిపై ఎన్ని విమర్శలు వచ్చినా చెదరకుండా సమాధానం ఇచ్చే వ్యక్తి ఆయన ఒక్కరే. ప్రతిపక్షాల సంగతి అన్న సంగతి కూడా పక్కనపెట్టి అవసరమైతే అసెంబ్లీ లో అందరినీ కలుపుకుని పోవటంలో ఆయనది స్పెషల్ పాత్ర. మరి అలాంటాయనకు కోపమెందుకు వచ్చిందంటారు? ప్రతిపక్షాల పలుకులకు ఆయనకు కొపమొచ్చిందంటే ఓ అర్థం. కానీ, ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనకు ఆగ్రహాం తెప్పించారండోయ్.
బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రైతుల రుణమాఫీకి సింగిల్ సెటిల్ మెంట్ వర్తింపజేయాలన్న డిమాండ్ తో ఒక్క గొంతుకతో నిరసన వ్యక్తం చేసిన విపక్షాలన్నింటినీ ప్రభుత్వం సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విపక్ష సభ్యుల సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అయితే అక్కడ అధికార పక్ష ఎమ్మెల్యేలు కూడా లేకపోవటం హరీష్ రావుకి ఆశ్చర్యం కలిగిచింది. ఆ టైంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై చర్చ జరుగుతోంది. ఇంతటి కీలక సమయంలో స్వపక్ష సభ్యులకు చెందిన సీట్లు కూడా ఖాళీగా కనిపించాయి. దీనిని గమనించిన హరీశ్ రావు, అసలు ఎమ్మెల్యేలంతా ఎక్కడికెళ్లారంటూ ఆరా తీశారట.
చర్చకు డుమ్మా కొట్టి లాబీలకు చేరిన ఎమ్మెల్యేలు ముచ్చట్లాడుకుంటున్నారని తెలిసిన ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు. కొద్దిసేపు వేచి చూసిన ఆయన ఆ తర్వాత ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను ఎమ్మెల్యేల వద్దకు పంపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుతో టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తల పట్టుకున్నారట. హరీశ్ ఆగ్రహం తెలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తర్వాత లాబీల్లో ముచ్చట్లకు వీడ్కోలు పలికి సభ లోపలికి వెళ్లారట. అదండీ అసలు సంగతి.