బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ఎవరొచ్చినా వదిలే ప్రసక్తే లేదంటున్నారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. తమ కూటమి కి ఎలాగైనా గెలుపు దక్కాలన్న ఆశయంతో వరుస ర్యాలీలతో ప్రచారం చేసుకుంటూ వెళ్లిపోతున్నారు ఆయన. ఈ క్రమంలో త్వరలో అక్కడ ప్రచారం చెయ్యడానికి వస్తున్న యోగా గురువు బాబా రాందేవ్ పై మాటల దాడికి దిగారు లాలూ.
ఆర్ఎస్ఎస్ కంటే బాబా రాందేవే ప్రమాదకరమని విమర్శించారు. రాందేవ్ ఆర్ఎస్ఎస్ ను మించిన కరుడుగట్టిన హిందుత్వవాది అని వ్యాఖ్యానించారు. ఆయన తయారుచేసే ఔషధాల్లో పశువుల ఎముకలు కలుపుతున్నారని సీపీఎం నేత బృందా కారత్ అన్న విషయాన్ని లాలూ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటప్పుడు పశువుల ఎముకలైనా, మనిషి ఎముకలైనా తేడా ఏముందని అడిగారు. బీహార్ లో ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ, నల్లధనం విషయంలో రాందేవ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాబా సాధువు కాదని, సొంత పనులు చక్కబెట్టుకునే వ్యక్తని విమర్శించారు. రాందేవ్ అమ్ముతున్న మందుల వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని లాలూ డిమాండ్ చేశారు.