ఏపీ అసెంబ్లీలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పార్టీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కోడెల శివప్రసాద్ ప్రకటించారు. కాల్ మనీపై చర్చ జరగాలని పట్టుబట్టిన జగన్, అంబేద్కర్ పై అధికార పక్షం ప్రారంభించిన చర్చను అడుగడుగునా అడ్డుకున్నారు. వైసీపీ సభ్యులు సభ ప్రారంభమైనప్పటి నుంచి స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన నిరసనలతో హోరెత్తించారు.
ముందుగా విపక్ష సభ్యులు కాల్ మనీ అంశంపై చర్చకు పట్టుబట్టడం, అయినా వినిపించుకోకుండా అధికార పక్షం యథా ప్రకారం అంబేద్కర్ అంశంపైనే చర్చ కిొనసాగించింది. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఒక్కసారిగా పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సహా సభలో ఉన్న మొత్తం విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు. దీనిపై సభ్యుల అభిప్రాయం తీసుకున్న స్పీకర్ జగన్ తో పాటు ఆయన పార్టీకి చెందిన సభ్యులను అంబేద్కర్ పై చర్చ ముగిసేదాకా సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ వేటు వేసినా రోజా సహా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం వారందరినీ మార్షల్స్ సహాయంతో బయటికి పంపివేశారు.