ప్రధాన ప్రతిపక్షనేత ప్రభావం చూపలేకపోయే పరిస్థితి బహుశా ఏపీలో తప్పా ఎక్కడా కనిపించదేమో. ఎప్పుడూ జనాల మధ్యలో ఉండి కూడా ప్రభుత్వంపై విరుచుకుపడే సత్తా లేకపోవటం ఆయనకున్న పెద్ద మైనస్. ఓ నేతగా ముఖ్యంగా ప్రతిపక్ష అధినేత గా వైకపా అధినేత జగన్మోహన్ రెడ్డి విఫలమవుతూ వస్తున్నాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతూ వస్తున్నాడు జగన్.
అదేంటంటే... పవన్ ప్రజాదరణ ఉన్నప్పటికీ సాధారణంగా జనాల మధ్యలో ఎక్కువ సేపు ఉండడు. ఒకవేళ ఉన్నా అవసరమైన సంభాషణ తప్ప మరేం వ్యక్తపరచడు. ఒకవేళ విమర్శలు చేయాల్సి వస్తే మాత్రం నేరుగా కాకుండా ట్విట్టర్లోనే చేస్తుంటాడు. భూసేకరణ, ప్రత్యేక హోదా వగైరా అంశాలను ట్విట్టర్ ద్వారానే ఖండించి ప్రభుత్వం దిగివచ్చేలా చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే పవన్ ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే తన ప్రభావం చూపుతూ వస్తున్నాడు. ఒక సినీ నటుడి నుంచి రాజకీయాలవైపు అడుగులు వేస్తున్న పవన్ పరిస్థితి ఇలా ఉంటే. మరి అలాంటి ప్రతిపక్ష నేతగా జగన్ ప్రభావం ఎలా ఉండాలి? కానీ, అది పూర్తిగా విరుద్ధంగా ఉంది.
పూర్తిగా ప్రజల మధ్య గడిపే ఆయన ప్రభుత్వాన్ని నిందించటంలో సక్సెస్ అవుతున్నాడు గానీ, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో విఫలమవుతున్నాడు. టైమింగ్ లేకపోవటంతోపాటు సరైన కేడర్ లేమి కూడా ఆయనను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో లాభం లేదనుకున్న ఆయన ట్విట్టర్ ను నమ్ముకున్నారు. అయితే ఆయన ట్వీట్ ల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. తాజాగా ఏపీ ప్రత్యేక హోదా అంశం ముగిసినట్లేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో ట్విట్టర్లో జగన్ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ విషయం తాము ఏనాడో చెప్పామని, ఇప్పటికైనా బాబు పెదవి విప్పాలని విమర్శలు గుప్పించాడు. అయితే జగన్ సంధించే అన్ని బాణాలను లైట్ తీసుకున్నట్లే ఈ ట్వీట్లను కూడా జనాలు లైట్ తీసుకుంటున్నారు. పవన్ ను ఫాలో అవుతున్నాడే తప్ప పెద్దగా ప్రభావం చూపటం లేదన్నది మాత్రం ఎప్పటికప్పుడు తేటతెల్లమైపోతుంది.