బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఆయనలో మాట్లాడేతీరుతోపాటు అధికార, ప్రతిపక్షాల మధ్య రాజీ కుదిర్చి సభ సజావుగా సాగేందుకు ప్రయత్నిస్తుంటారు. మునుపటి సమావేశాల సందర్భంగా వైసీపీ సభ్యుల సస్పెన్షన్ తో రంగం ప్రవేశం చేసిన విష్ణు కుమార్ రాజు ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చారు. ఆ తర్వాత సభ కాస్తంత సజావుగానే సాగింది.
తాజాగా నిన్నటి వర్షాల కాల సమావేశాల ముగింపు రోజున ఓటుకు నోటు కేసుపై విపక్షం పట్టుపట్టింది. అయితే ఏపీకి సంబంధం లేని కేసుపై చర్చకు అధికార పక్షం ససేమిరా అంది. ఈ నేపథ్యంలో సభలో వైసీపీ ఆందోళన బాటపట్టింది. ఈ సందర్భంగా సభ స్వల్పకాలికంగా వాయిదా పడ్డ తర్వాత విష్ణుకుమార్ నేరుగా జగన్ ఛాంబర్ కు వెళ్లాడట. సభలో ప్రతిష్టంబన లేకుండా చివరి రోజు సమావేశాలు సజావుగా సాగాలని జగన్ ను కోరారట. తాము నోటీసు ఇచ్చిన విధంగా ముందుగా ఓటుకు నోటు కేసుపై చర్చ జరిగేలా చూడండి, ఆ తర్వాత ఇతర అంశాలపై చర్చకు సిద్ధమేనని జగన్ రాజుకి తేల్చిచెప్పారట. దీంతో చేసేది లేక విష్ణు కుమార్ వెనుదిరిగారట. ప్చ్... రాజుగారి రాయబారం ఈసారికి విఫలమైంది.