స్పీకర్ కొడెల మనసు తీవ్రంగా గాయపరచిన జగన్ బ్రుందం తమ పరుష వాక్యపాలనకు పశ్చాత్తాపం ప్రకటించేరు. కావలసినంతసేపు మాట్లాడే అవకాశమివ్వకుండా మైకు తెగ్గొట్టడంతో జగన్ వారి అనుచరులు అసహనానికి గురై పోడియం దగ్గరకు చేరి కొడెలను తూలనాడేరని అభియోగం. అది ఒక ఏడాదిపాటు సస్పెండయ్యే ప్రమాద ఘంటికలు వినపడ్డాయి. జగన్ నాన్న గారి టైంలో కరణం బలరాంని అట్టే మాదిరిగానే సస్పెండ్ చేసిన తీరును తెలుగుదేశం వారు ఉదహరించి అలాగే కానిద్దాం అన్నారు. చల్లబడ్డ చంద్రుడు, కాలుదువ్వని కొడెల ‘హుందా’ మంత్రం పఠించి ప్రతిష్ఠంబన తొలగించేందుకు దోహదపడ్డారు. ఇలాంటి సుహ్రుద్భావన వాతావరణం ఏర్పడుతుండగా, జగన్ తప్పులు ఎవరైనా చేస్తారుగానీ మాలాగా తప్పు ఒప్పుకునే నాగరికత చంద్రుడికి లేదంటూ గతంలో కుతూహలమ్మ కంటతడి పెట్టిన విషయం ప్రస్తావిస్తూ చంద్రుడికి క్షమించమని అడగడానికి నోరు రాలేదే అని విచారించేరు. జరిగింది తప్పే క్షమించండి అని నిర్ద్వంద్వంగా బేషరతుగా అంటూనే జగన్ వయసుకి మించిన పరిపక్వతతో లౌక్యం జోడించి తప్పుచేసి ఉంటే, సభాపతి మనస్సు గాయపడి ఉంటే, మా సభ్యుల ప్రవర్తన ఇబ్బంది పెట్టుంటే, పరుష పదజాలం దొర్లి ఉంటే, ఆవేశంలో మాట జారి ఉంటే, హక్కులను ఉల్లంఘించి ఉంటే... ఇలా అయితే గియితే కండిషన్స్ జోడిస్తూ క్షమాపణలంద చేయడం జరిగింది.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏముంది ప్రభువా... అని స్పీకరు కోడెల వ్యవహారానికి ముగింపు పలికేరు- ఆమెన్!