జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. కొంతకాలంగా మెడనొప్పి, జ్వరంతో బాధపడుతున్న ముఫ్తీ మహ్మద్ సయీద్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గత పదిరోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వెంటిలేటర్ పైన ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఆయన ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.
1936 జనవరి 12న జమ్ముకశ్మీర్ లోని బిజ్ హెహరాలో జన్మించిన ముఫ్తీ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. కశ్మీర్ ప్రజల హక్కుల సాధన కోసం ఉద్యమించిన నేతగా ఆయనకు పేరుంది. 1989-90 మధ్య కాలంలో కేంద్ర హోంమంత్రిగా ఆయన పనిచేశారు. అప్పుడు ఆయన కూతురు రుబియాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో జైల్లో ఉన్న ఐదుగురు ఉగ్రవాదుల విడుదల చేయించడం ద్వారా తన కూతురును ముఫ్తీ విడిపించుకున్నారు. ఆపై 1990 లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. 2002-2005 మధ్య ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తిరిగి 2015 మార్చి 1న బీజేపీ సహకారంతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
కాగా, ముఫ్తీ మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలు సంతాపం తెలిపారు. పేద ప్రజలు అంటే ఆయకు ఇష్టమని, ఆయన మృతి చాలా కలిచివేసిందని హోంమంత్రి రాజ్ నాథ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.