జానారెడ్డి-కేసీఆర్... ఎందుకంత ప్రేమ?

October 10, 2015 | 02:58 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kcr-jana-reddy-farmers-telangana-bandh-niharonline

ప్రతిపక్ష నేత అంటే ఏం చేసినా, చెయ్యక పోయినా అధికార పక్షంపై ఎప్పుడూ విరుచుకుపడుతు విమర్శలు చేస్తూనే ఉండాలి. అందివచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకుని ఆవేశంతో ఊగిపోతూ ప్రభుత్వాన్ని రఫ్ఫాడించాలి. అడపాదడపా మీడియా సమావేశాలు పెట్టి హడావుడి చేసి ఉతికి ఆరేయాలి. కానీ వాటిల్లో ఒక్క లక్షణమైన మచ్చుకు కూడా లేని నేతగా తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి మిగిలారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పన్నెత్తి మాట్లాడిన పాపాన పోలేదు. టీడీపీ నేతలు గులాబీ గూటిపై కారాలు మిరియాలు నూరుతుంటే... కిక్కురుమనకుండా ఉండటం ఈ సీనియర్ నేత స్పెషాలిటీ.

తాజాగా రైతు సమస్యలపై సర్కారు వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా బంద్ జరుగుతుంటే... కనీసం తోటి నేతలకు సంఘీభావం కూడా తెలపకపోవటంతో జానారెడ్డిపై మిగతా పార్టీ అధినేతలంతా రుసరుసలాడుతున్నారు. దీంతో బయటకు వచ్చిన ఆయన గోషామహల్ వద్ద అరెస్టైన తమ నేతలకు సంఘీభావం తెలిపాడు. సమస్యల పరిష్కారం కోసం అన్ని పక్షాలు ఒకటి కావటం శుభపరిణామమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి ఇక ముందు కూడా విపక్షాలు ఐక్యత చాటుకోవాలని కవరింగ్ చేసుకునే పని చేశారు జానా. అయితే బంద్ ను ఇంతలా తొక్కిపడేసిన ముఖ్యమంత్రి పై ఒక్క విమర్శ కూడా చెయ్యకపోవటంపై తోటి నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు జానా ఎందుకిలా చేస్తున్నారని వారు ప్రశ్నించుకుంటున్నారు.

ఇందుకు సమాధానం తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలోనే మీకు దొరకొచ్చు. సమావేశాల సందర్భంగా కేసీఆర్ జానారెడ్డిని పొగడటం, జానా కూడా కాస్త సుదిమెత్తగానే అధికారపక్షంతో వ్యవహరించటం దీనిని బలపరుస్తుంది. నిజానికి కేసీఆర్ కి జానారెడ్డికి ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. కాంగ్రెస్ లోని కురువృద్ధులను సైతం వదలకుండా దుమ్ముదులిపిన కేసీఆర్, సీనియర్ నేత అయిన జానారెడ్డిని ఏనాడూ తిట్టలేదంటే అర్థం చేసుకోవచ్చు వారి మధ్య మైత్రి ఏపాటిదో. ఇప్పుడీ బంద్ సందర్భంగా వారి ప్రేమ మరోసారి బయటపడిందని, జానా ఎప్పుడిలా సున్నితంగా వ్యవహరిస్తారని సొంత నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ