బాబుగారు హిస్టరీ రిపీట్ అవుతుందండీ!

October 10, 2015 | 10:42 AM | 2 Views
ప్రింట్ కామెంట్
chandrababu-naidu-restictions-for-amaravathi-stepping-invitation-niharonline

అమరావతి శంకుస్థాపన దగ్గర పడే కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా, రాజధాని గ్రామాల్లోనూ పౌరుల కదలికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించి అణచిపెట్టాలని తాపత్రయ పడటం ప్రజాస్వామ్యానికి విఘాతం. అట్టహాసాల మాటున స్వేచ్ఛకు భంగం కలిగించేందుకు పాల్పడుతున్నారు.  విశ్వనగరంగా అమరావతిని అభివర్ణిస్తూ ప్రచారం లంకించుకున్న ముఖ్యమంత్రి, శంకుస్థాపన అదరగొడతామని హోరెత్తిస్తున్నారు. అయితే అందుకోసం జనజీవితాన్ని అస్తవ్యస్తం చెయ్యటం కరెక్ట్ కాదు. గతంలో జార్జిబుష్, ఉల్పెన్ సన్, టోనీ బ్లెయర్ రాక సందర్భంగా జరిగిన నిర్భాంధాన్నే మళ్లీ కలిగిస్తున్నారనటంలో ఎలాంటి సందేహం లేదు.

సొంత రాష్ట్రంలో పోలీస్‌ కవాతు... వెలుపలి ప్రపంచానికి డిజిటల్ డాబు ఇది చంద్రబాబు పాటిస్తున్న పద్ధతి. రాజధాని శంకుస్థాపనకు సింగపూర్‌, జపాన్‌ సహా 180 దేశాల ప్రతినిధులు వేంచేస్తారని, మన దేశంలోని అతిరథ మహారథులందరూ హాజరవుతారని ప్రభుత్వం ఎత్తుకున్న ప్రచారానికి ఆకాశమే హద్దు. ఏర్పాట్లపై చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అలాంటి కార్యక్రమం దగ్గరపడుతుంటే సంతోష పడాలో లేక జనజీవితం స్తంభిస్తున్నందుకు బాధపడాలో అర్థం కావటంలేదు. అసలు శంకుస్థాపన తేదీ ప్రకటించారో లేదో అప్పటి నుంచే గ్రామాల్లో పోలీసు బూట్ల చప్పుడు మొదలైంది.  పహారా, తనిఖీల పేరుతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

అభివృద్ధి మంచిదే. కానీ, అదే టైంలో జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిపై ఉంటుంది. పాలనా పరంగా మంచి మార్కులు కొట్టేస్తున్న టైంలో ఇలాంటివాటి వల్ల పూర్తిగా దెబ్బతినే అవకాశాలున్నాయి. చరిత్రలో నియంతృత్వ ప్రభుత్వాలెన్నో అడ్రస్‌ లేకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. ఒకసారి అలాంటి దెబ్బ ఆయన కూడా అనుభవించారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచింది. లేకుంటే చరిత్ర మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ