తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీని, ప్రాణంగా భావించే పదవులను సైతం పక్కనపెట్టి పోరాడితే చివరకు మిగిలింది ఏంటని కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న వైర్యాగ్యం తెలిసిందే. ఎంతో కష్టపడి పార్లమెంటు తలుపులు మూసి బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసి మరీ ఒక రాష్ట్రప్రజల కలను నెరవేర్చింది. అయితే ఒక రాష్ట్రంలో నష్టపోయినప్పటికీ, మరోచోట లాభపడతామనే భావనతోనే చేసినప్పటికీ ఫలితం శూన్యం. రెండూ చోట్ల దెబ్బపడింది. కాకపోతే తెలంగాణలో ప్రతిపక్ష హోదాతోనైనా కాస్త ఊరట కలిగింది. దీంతో వారు తమ విచారాన్ని ఎక్కడా భయటపెట్టకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.
కానీ ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితులను చూసి ఆ పార్టీలో కలకలం రేగుతుంది. పార్టీ నుంచి అధికార పక్షానికి వలసలు కొనసాగటమే కాదు, రానున్న ఎన్నికల్లో తమ ప్రాభావ్యం ఎక్కడా లేకుండా పోతుందనే బాధలో కూరుకుపోతుంది. ఓవైపు నమ్మిన నేతలు పోతున్నప్పటికీ ప్రజలు కూడా హ్యాండిచ్చి ఎన్నికల్లో కారుకే పట్టాభిషేకం చేస్తున్నారు. దీంతో ప్రజలకైనా తమ గొడు వెల్లబెట్టుకుంటున్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. సకల జనులు ఆందోళనలో పాల్గొన్నారని, పార్టీని, పదవులను పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడామని ఆయన అంటున్నారు. అంత కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఆవేదనను కలిగిస్తున్నాయని మండిపడ్డారు. మీరంతా ఎన్నో ఆశలతో ఎన్నుకున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని. ఈ విషయాన్ని అంతా గమనించాలని ప్రజలనుద్దేశించి అన్నారు. ఇందుకేనా మీరు తెలంగాణను కోరుకుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు. మేధావులు కూడా దీనిపై స్పందించాలని కోరుతున్నారు. అది అరణ్య వేదనే అన్న విషయం ఆయనకు బహుశా అర్థం కావట్లేదు కాబోలు.