తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షానికి ఊపిరి సలపని పరిస్థితి. ఎటువంటి ఆరోపణలు, విమర్శలు వచ్చినా విజయవంతంగా తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఉన్న నేతలు ఉన్నప్పటికీ ఏం చెయ్యాలో పాలుపోనీ స్థితికి చేరుకుంది. అయితే ఇప్పటి పరిస్థితికి అసలు కారణం ఏమిటి? ఎడమొహం పెడమొహం ఉన్న పక్షాలన్నీ ఉన్నట్టుండీ ఒకే తాటిపైకి వచ్చి ఎదురుదాడికి దిగటం గులాబీ బాస్ అస్సలు ఊహించి ఉండరు. మరి ఏమైందని వారంతా అలా ఒకటైపోయారు.
అసలేం జరిగింది... ఇంతకీ విషయమేమిటంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశం ఇన్నాళ్లు ఏ పార్టీకి దొరక్కుండా పోయింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కి కూడా ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు రైతుల ఆత్మహత్య అనే ఓ పవర్ ఫుల్ ఆయుధం చిక్కినట్లైంది. రాష్ట్రంలో రోజూ పదుల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టలేకపోయామని కాంగ్రెస్ ముఖ్యంగా, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అంతర్మథనంలో పడిపోయారు. సీఎల్పీలోని తన చాంబర్ లో ఆయన ఇదే విషయంపై తన పార్టీ సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మదిలో ఓ మంచి ఐడియా మెదిలింది. వెనువెంటనే టీడీపీ, బీజేపీ, వైసీపీ, వామపక్షాల శాసనసభాపక్ష నేతలను తన కార్యాలయానికి పిలిపించారు. సీనియర్ సభ్యుడైన జానారెడ్డి నుంచి ఆహ్వానం అందడంతో టీడీపీ సహా అన్ని పార్టీల నేతలూ పార్టీ విభేదాలను పక్కనబెట్టి సీఎల్పీకి తరలివెళ్లారు.
విపక్షాలన్నీ మూకుమ్మడిగా దాడికి దిగితే తప్పించి ప్రభుత్వం దారికి రాదని జానారెడ్డి మిగిలిన పార్టీల నేతలకు చెప్పారట. దీనికి అంతా సై అన్నారు. వెనువెంటనే అసెంబ్లీకి వెళ్లి రైతుల రుణమాఫీపై ‘సింగిల్ సెటిల్ మెంట్’కు పట్టుబట్టారు. ఊహించని పరిణామానికి అధికార పక్షం గుక్క తిప్పుకోలేకపోయింది. దీంతో ఇకపై ఇదే వ్యూహాన్ని అవలంబించాలని జానారెడ్డి మిగిలిన పార్టీ నేతలకు సూచించారు. జానా ఒక్క ఐడియా ఎంత పని చేసింది.