గాలికి పోయే కంపను దేనికో తగిలించుకున్నట్లు తయారయ్యింది టీడీపీ నేతల వ్యవహారం. మొన్నామధ్య సెక్షన్ 8 అంటూ సాక్షాత్తూ గవర్నర్ నరసింహన్ గారినే పిచ్చి పిచ్చిగా తిట్టి అభాసుపాలయ్యారు తెలుగు తమ్ముళ్లు. వారిలో మహా మహా మంత్రి వర్యులు కూడా ఉన్నారు. అంత జరిగినా వారిని వారించడం గానీ చెయ్యలేదు అధినేత చంద్రబాబు. చివరికి ఎలాగోలా (నరసింహుడి ఆగ్రహాంతో) ఆ వ్యవహారం సద్దుమణిగిందనుకోండి. తాజాగా ఆర్థిక శాఖ మంత్రి కూడా ఈ రకమైన కామెంట్లే చేసి పంచ్ ల పాలయ్యారు. ఈసారి ఆయన కదిలించి, దొబ్బులు పెట్టించుకుంది ఎవరి దగ్గరి నుంచో కాదు... జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి.
భూసేకరణ ఎలా చెయ్యాలో పవనే చెప్పాలంటూ యనమల నిన్నటి రోజున వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పవన్ కాసేపటి క్రితం ట్విట్టర్లో స్పందించాడు...
‘‘ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత అలోచించవచ్చు .. సినిమా పరిశ్రమకి హైదరాబాద్ లో ఇచ్చినివి కొండలు, బహుళ పంటలు పండే పొలాలు కాదు ,ఇది రామకృష్ణుడు గారికి తెలియదనుకుంట. పైగా..హైదరాబాద్ కొండల్లో కానీ, విశాఖపట్నం కొండల్లో కానీ నాకైతే స్టూడియోలు లేవు. నేను ఎంతోబాధ్యతతో రైతుల సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే విజ్ఞతతో స్పందిచడం మానేసి రైతుల ఆవేదనని వెటకారం చెయ్యడం వారికే చెల్లింది. నేను త్వరలోనే బేతపూడి, ఉండవల్లి ,పెనుమాక తదితర నది పరివాహక గ్రామాల రైతులిని కలుస్తాను’’ అంటూ ట్విట్టర్లో పవన్ పేర్కొన్నారు. మొత్తానికి సున్నితమైన వ్యవహారాల్లో స్పందించేప్పుడు జాగ్రత్తగా కాకుండా, వ్యంగ్యంగా వ్యవహరిస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది మరి. ఇంతకీ యనమలకు తెలియందీ పవన్ కళ్యాణ్ కు తెలిసిందీ ఏంటంటే లౌక్యం.