అలనాటి నటి, మాజీ ఎంపీ జయప్రద కమలం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈ విషయమై ఆమె కమలనాథులతో చర్చిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆమె పార్టీలో చేరతారనే వార్త ఎప్పటినుంచో మీడియాలో హల్ చల్ చేస్తోంది. పదవులు ఆశించి తాను బీజేపీలో చేరటం లేదని, సాధారణ కార్యకర్తలాగానే పార్టీలో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కాగా, తొలుత ఎన్టీఆర్ ఆహ్వనం మేరకు ఆమె 1994 లో టీడీపీలో చేరారు. అనంతరం 1996 లో రాజ్యసభకు ఎంపిక కావటంతోపాటు తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేశారు. అయితే చంద్రబాబుతో విభేదాల కారణంగా అప్పట్లో పార్టీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎంపికయి క్రీయాశీలక రాజకీయల్లో పాలుపంచుకున్నారు. తదనంతరం అమర్ సింగ్ కు మద్ధతుగా నిలిచి సమాజ్ వాదీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. గత ఎన్నికల్లో ఆర్ ఎల్డీ తరపున బిజ్నోర్ స్థానంలో పోటీచేసి ఓటమిపాలయ్యారు.