తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై జయలలిత మళ్లీ పాదం మోపారు. శుక్రవారం మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరుగుతున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, నేతలు హాజరయ్యారు. గవర్నర్ రోశయ్య సమక్షంలో ఆమెతోపాటు మరో 29 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సహా మరో సినీ నటుడు శరత్ కుమార్, ఇళయరాజా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, పలువురు బీజేపీ కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా గతంలో జయకు బద్ధ శత్రువుగా పేరుబడ్డ రజనీకాంత్ ఈ కార్యక్రమానికి హాజరవ్వటం అక్కడున్న ప్రతిఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రజనీ రాకతో అక్కడున్న అన్నాడీఎంకే కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేశారు. అక్రమాస్తులు కూడబెట్టారన్న కేసులో కర్ణాటక హైకోర్టు నిర్ధోషిగా తేల్చటంతో ఇక ఐదోసారి ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం పట్ల కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అభినందనలు తెలిపారు.