ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ త్వరలోనే ఆ పదవి నుంచి తప్పుకోవటం ఖాయమేనని తెలుస్తోంది. దీంతో తర్వాతి గవర్నర్ ఎవరనే చర్చ నడుస్తోంది. అయితే ఇరు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలా? లేక పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఒక్కరినే కొనసాగించాలా అన్న మీమాంసలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా నరసింహన్ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కేరళ గవర్నర్ జస్టిస్ సదాశివం నియమితులు కానున్నారన్న ప్రచారం ఊపందుకుంది. విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య న్యాయపరమైన వివాదాలు తలెత్తుతున్నాయని భావిస్తున్న కేంద్రం, సదరు వివాదాలను సదాశివం లాంటి న్యాయ కోవిదుడైతేనే పరిష్కరించగలరని భావిస్తోంది. అంతేగాక తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం అనుభవజ్ణుడైన వ్యక్తి గవర్నర్ గా ఉంటే బాగుంటుందన్న వాదన కూడా కేంద్రం పెద్దల్లో వ్యక్తమవుతోంది. త్వరలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, పలువురికి స్థానచలనంపై నిర్ణయం తీసుకోనున్న కేంద్రం, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ మార్పుపైనే ప్రధానంగా ద్రుష్టిసారించినట్లు తెలుస్తోంది.