తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ వారసులుగా కేటీఆర్, కవితలు ఎవరికీ వారు సెపరేట్ రూట్ లో వెళ్తున్నారు. ఓవైపు రాజకీయాల్లో రాణిస్తూనే, మరోవైపు సాంస్కృతిక రంగాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ సెలబ్రిటీలుగా మారిపోయారు. మంత్రిగా కేటీఆర్ తనదైన శైలిలో దూసుకెళ్తూ మొన్న గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటి సీఎం రేసులోకి ఎంటర్ అయిపోయారు. మరోవైపు నిజామాబాద్ ఎంపీగా కవిత పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండటమే కాదు, తన నియోజకవర్గ పనులు పార్టీల పనులతో తీరిక లేకుండా ఉంది. అదే టైంలో క్యాడర్ పరంగా కూడా నేతలతో టచ్ లో ఉంటుంది. ఈ మధ్య అది మరీ ఎక్కువైపోయింది. తాజాగా మాగంటి, గాంధీ చేరిక సమయంలో ఆమె ముందుండటం దీనికి మరింత వాదం చేకూరుస్తుంది. తన కార్లోనే వారిద్దరిని సీఎం క్యాంప్ ఆఫీస్ కు తీసుకెళ్లటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇక కార్యకర్తలు కూడా కేటీఆర్ తో సమానంగా కవితకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఊదరగొడుతున్నారు. అందులో భాగంగా వారంతా ఆమెకు కొత్త బిరుదు ఇచ్చేశారు. తెలంగాణ దీదీ కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలు అని వెలిసిన పోస్టర్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీదీ అంటే టక్కున గుర్తోచ్చేది బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇక ఇప్పుడు తెలంగాణ వరకొచ్చేసరికి కల్వకుంట్ల కవితకు ఆ హోదాను కట్టబెట్టారు. ఎంపీగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కవిత జోక్యం ఎంత వరకు దారితీస్తుందోనని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేసుకుంటున్నారు.