తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటువేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు ఆశ్చర్యపరిచారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో పర్యటించిన ఆమె ఖైరతాబాద్ లో మీడియాతో మాట్లాడారు. అయితే అందుకోసం బీజేపీకి ఆమె ఒక కండిషన్ పెట్టారు లేండి. బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలకు కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉంటే తెలంగాణకు రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఇప్పించాలని, అలా ఇప్పిస్తే తాను బీజేపీకే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తాము మాటలు చెప్పమని... చేసి చూపిస్తామని పరోక్షంగా బీజేపీ నేతలను కవిత ఎద్దేవా చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తమ పార్టీ కార్యకర్తలు సర్వసన్నద్ధంగా ఉన్నారని తెలిపారు. ఖైరతాబాద్ లో పేదల ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. హైటెక్ సిటీ కట్టారు కానీ డ్రైనేజీని మరచిపోయారని సీఎం చంద్రబాబుపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని, అందుకే గ్రేటర్ ఎన్నికల్లో 75 సీట్లు మహిళలకు కేటాయించారని చెప్పారు.