ప్రభుత్వం తరపున జరిగే ఏ కార్యక్రమం అయినా ప్రోటోకాల్ ప్రకారం అగ్ర నేతల ఫోటోలు, పేర్లు ఉండటం కంపల్సరీ. కానీ, ఇక్కడో ఆ ఆహ్వాన పత్రికలో ఏకంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తినే విస్మరించారు. మంత్రులు, మున్సిపల్ అధికారుల ఫొటోలు ఉన్నాయి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో మాత్రం లేదు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జరిగిన ఈ తప్పిదంతో ఇప్పుడు విమర్శలు వచ్చి పడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే... పెద్దాపురం శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆహ్వాన పత్రికను సంబంధింత శాఖాధికారులు తయారు చేశారు. ఆ ఆహ్వానపత్రికలో మంత్రులు చిన రాజప్ప, నారాయణతో పాటు మున్సిపల్ అధికారుల ఫొటోలు అందులో ఉన్నాయి. అయితే, సీఎం చంద్రబాబు పేరు మాత్రం రాసి, ఆయన ఫొటో లేకుండా ఈ ఆహ్వాన పత్రికను తయారు చేశారు. దీంతో, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్ అధికారులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి ఫొటో లేకుండా ఇదెట్లా కుదురుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. తప్పును సరిదిద్ది మళ్లీ పత్రికలు ప్రింట్ చేయటం కుదిరే పని కాదని అధికారులు చెబుతున్నా, నేతలు మాత్రం తిరిగి చేయాల్సిందేనని పట్టుబడుతున్నారంట.