గ్రేటర్ ఎన్నికల హడావుడి అయితేనేం, కేసీఆర్ జన్మదినమైతేనేమి టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహానికి అంతుపొంతు లేకుండా పోతుంది. నిబంధనలను పక్కనబెట్టి ఏకంగా రోడ్ల మధ్యలోని స్తంభాలకు వేలాడదీసిన పోస్టర్లు ఇబ్బందికరంగా మారుతున్నాయి. కొంచెం ఏమరపాటుగా నడిచినా సరే పాదచారుల పాలిట అవి మృత్యు శకటాలుగా మారుతున్నాయి. గట్టిగా ఉన్న వెదురు కర్రల సాయంతో వేలాడదీసిన ఈ పోస్టర్లను వేగంగా వెళుతున్న ఏ బైకర్ అయినా తాకితే, అతని శరీరం చీరుకుపోవడం ఖాయం. ఎంత వేగంగా వెళ్లితే గాయాల తీవ్రత అంతగా ఉంటుందన్న మాట.
తాజాగా కేసీఆర్ 63వ జన్మదినం సందర్భంగా ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్లు, కింది స్థాయి నేతల వరకూ తమ తమ ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లు పెద్దఎత్తున రోడ్లపై ప్రదర్శనకు ఉంచారు. వాస్తవానికి ఇలా ఫ్లెక్లీలను, పోస్టర్లను రోడ్లపై ఉంచకూడదన్న నిబంధనలు ఉన్నాయి. రూల్స్ తోపాటు ప్రజల రక్షణ పరిగణనలోకి తీసుకునే జీహెచ్ఎంసీ అధికారులు ఉత్సవాలు, లేదా వేడుకలు ముగిసిన రెండో రోజు వీటిని తొలగిస్తుంటారు. కానీ, ఈ దఫా అవి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పే పోస్టర్లు కావడంతో వాటి జోలికి పోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే వాటిని తొలగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీనిపై జీహెచ్ఎంసీకి పలు ఫిర్యాదులు కూడా అందినట్లు సమాచారం.