తమ సమస్యలు తీర్చండి మహాప్రభో అంటూ మంత్రులను, అధికారులను ప్రజలు వేడుకోవటం, కాస్త ముందుకు వెళ్లి నిలదీయటాన్ని తిప్పి, తిప్పి చూపిస్తుంటే టీవీలకు అతుక్కుపోయి చూడటం మనవంతు. అయితే ఆయన ఓ రాష్ట్ర మంత్రి అయితేనేం అధికారుల వెంటపడి సమస్యను సాయంత్రం లోగా తీర్చాడు. ఏపీ రవాణా శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు ఈ హీరోయిక్ పని చేసి వార్తల్లో నిలిచారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా వెల్లువెత్తిన తుపాను దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఈ తుపాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై మాత్రం పెను ప్రభావాన్ని చూపింది. కోల్ కతా నుంచి చెన్నైకి దారి తీసే జాతీయ రహదారి ఎక్కడికక్కడ కోతలకు గురైంది. రహదారిపై ఏర్పడ్డ భారీ గోతుల కారణంగా మూడు రోజుల పాటు రెండు నగరాల మధ్య దాదాపుగా రాకపోకలు స్తంభించాయి. బుధవారం సాయంత్రానికి తుపాను కాస్తంత తగ్గుముఖం పట్టగానే జిల్లా ఇన్ చార్జీ మంత్రిగా ఉన్న ఆయన రంగంలోకి దిగారు.
గురువారం ఉదయమే కార్యరంగంలోకి దిగిన సిద్ధా నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. మంత్రి ఆదేశాలతో మొన్న రాత్రి నుంచే అధికార యంత్రాంగం జాతీయ రహదారిపైకి వచ్చేసింది. నిన్న ఉదయం మంత్రి కూడా తమతో జత కలవడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. సాయంత్రంలోగానే జాతీయ రహదారిపై ఏర్పడ్డ గోతులన్నీ కనుమరుగయ్యాయి. అందుబాటులో ఉన్న వాహనాలు, కూలీలను రంగంలోకి దించిన మంత్రి యుద్ధ ప్రాతిపదికన రహదారిపై పడిన గోతులను పూడ్చివేయించారు. నిన్న సాయంత్రానికి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పున:ప్రారంభం కావడంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. వాహనాల రాకపోకలు ప్రారంభమైన తర్వాత కాని మంత్రి అక్కడి నుంచి కదలలేదట.