గత కొన్నాళ్ళు గా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాటల గురించి అందరికీ తెలిసిందే. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొందరు పార్టీ పదవుల కేటాయింపుపై విమర్శలకు దిగడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ జాతీయ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. అయితే కేజ్రీవాల్ రాజీనామా అనంతరం మాట్లాడుతూ రెండు పదవులూ సమర్ధవంతంగా నిర్వహించడం సాధ్యం కావట్లేదని, అందుకే పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. ఇకపై పరిపాలనపైనే పూర్తి స్థాయిలో ద్రుష్టి పెడుతున్నట్టు తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ కౌన్సిల్ కు పంపించారు. గత జాతీయ కార్యవర్గ సమావేశాల లోనే కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని చెప్పినప్పటికీ ఆనాడు అందరూ వ్యతిరేకించారని ఆప్ నేత అశుతోష్ తెలిపారు. జరుగుతున్న అంతర్గత కలహాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ భేటీకి కేజ్రీవాల్ హాజరు కావడం లేదు. అనారోగ్యం వల్ల ఆయన హాజరు కాలేకపోతున్నట్టు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆయన చికిత్స నిమిత్తం బెంగుళూరు వెళుతున్నట్టు తెలిసింది. ఒత్తిడుల కారణంగా ఆయనకు షుగర్ బాగా పెరిగినట్టు తెలుస్తోంది. మెడిసిన్ వల్ల అదుపులోకి రాకపోవడంతో నేచురల్ చికిత్స నిమిత్తం ఆయన బెంగ్లూర్ ప్రయాణమయ్యారు. కాగా ఈ కార్యవర్గ సమావేశంలో ఇరువురు సీనియర్ నాయకులకు ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది.