మత సంబంధిత వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో వాళ్లకింకా అర్థం కావట్లేదు. పోనీ అంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. ఇతర మతాల పైకూడా పడి ఇష్టమోచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. తాజాగా ఆర్ఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మథర్ థెరిస్సాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించాడు. ‘‘ఆమె ఓ ఉన్నతమైన మనిషి. దయచేసి ఆమెను వదిలేయండి. కోల్ కతాలో ఉన్నప్పుడు నేను ఆమెతోపాటు సేవాకార్యక్రమాలలో పాల్గొన్నాను. అనవసరంగా ఆమెను మతంలోకి లాగొద్దు’’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఇంతకీ మోహన్ భగవత్ ఏమన్నాడంటే... మదర్ థెరిస్సా పేదలకు చేసిన సేవా కార్యక్రమాల వెనుక పెద్ద దురుద్దేశం ఉందని. ఆమె తన సేవా కార్యక్రమాల ద్వారా మత మార్పిడి కోసం ప్రయత్నించిందని ఆయన ఆరోపించాడు. సోమవారం రాజస్థాన్ లోని భారతపూర్ సమీపంలో ఓ ఎన్జీవో కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశాడు. సేవ వెనుక ఆమెకు(మదర్ థెరిస్సా) అలాంటి ఉద్దేశం ఉండేది, కానీ, నిస్వార్థమైన సేవ అంటే ఈ ఎన్జీవోను చూస్తే తెలుస్తోందంటూ ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓ బ్రెయిన్ సీరియస్ గా స్పందించాడు. ఆమెకు అసలు మత పరమైన ఆలోచనలు లేనేలేవు. కేవలం పేదలను ప్రేమించటమే తెలుసు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయటం మోహన్ భగవత్ కు తగదు అంటూ ఘాటుగా స్పందించాడు.